గద్దర్‌పై అమిత్ షా విమర్శలు: కాంగ్రెస్ నేతలు సీరియస్
బిజెపికి చిత్తశుద్ధి ఉంటే గద్దర్ విషయంలో ప్రధాని మోదీ అనుసరించిన వైఖరి తప్పో, అమిత్ షా మాటలు తప్పో తేల్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు.
హైదరాబాద్: లోక్‌సభలో వామపక్ష తీవ్రవాద (LWE) నిర్మూలనపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. భారత జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ ప్రజా గాయకుడు గద్దర్‌ను కలవడాన్ని ప్రస్తావిస్తూ, గద్దర్ మావోయిస్ట్ భావజాలం కలవారని, అటువంటి వారితో రాహుల్ సంబంధాలు పెట్టుకోవడాన్ని అమిత్ షా తప్పుబట్టారు. నాటి ఇందిరా గాంధీ నిర్ణయాల నుంచి నేటి రాహుల్ గాంధీ పర్యటనల వరకు కాంగ్రెస్ పార్టీ నక్సలిజాన్ని ప్రోత్సహించిందని ఆయన ఆరోపించారు. అయితే, ఈ విమర్శలను తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తూ, బిజెపి ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నారు.
గద్దర్ కుమార్తుకు లేఖ రాసిన ప్రధాని మోదీ
అమిత్ షా వ్యాఖ్యలను తిప్పికొడుతూ కాంగ్రెస్ నేతలు ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. 2023లో గద్దర్ మరణించిన సమయంలో ప్రధాని మోదీ స్వయంగా విమల గద్దర్‌కు సంతాప లేఖ రాశారని, ఆ లేఖలో గద్దర్ చేసిన సామాజిక సేవలను, ఆయన అణగారిన వర్గాల కోసం ఎత్తిన గొంతుకను ప్రశంసించారని వారు గుర్తు చేస్తున్నారు. "ఒకవైపు ప్రధాని మోదీ గద్దర్‌ను గౌరవిస్తూ లేఖలు రాస్తుంటే, మరోవైపు హోంమంత్రి అమిత్ షా అదే గద్దర్‌ను కలవడం నేరమని రాహుల్ గాంధీని విమర్శించడాన్ని తప్పుబడుతున్నారు. గద్దర్‌ను కలవడమే తప్పయితే, ఆయన మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీని అమిత్ షా ఎందుకు ప్రశ్నించలేదని వారు నిలదీస్తున్నారు.
మోదీ తప్పా.. అమిత్ షా తప్పా - బీజేపీ తేల్చుకోవాలి
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను, ఆయన పాడుకున్న వేలాది పాటలను, ప్రజల్లో ఆయనకున్న ఆదరణను కించపరచడం ద్వారా అమిత్ షా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. గద్దర్ తన జీవితాంతం ప్రజాస్వామ్య బద్ధంగా పోరాటాలు చేశారని, చివరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ప్రజాస్వామ్య స్రవంతిలో భాగమయ్యారని వారు పేర్కొంటున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక చనిపోయిన ప్రజా కవిపై బురద చల్లడం అమిత్ షా దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని మండిపడుతున్నారు. బిజెపికి చిత్తశుద్ధి ఉంటే గద్దర్ విషయంలో ప్రధాని మోదీ అనుసరించిన వైఖరి తప్పో, అమిత్ షా మాటలు తప్పో తేల్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సవాల్ విసురుతున్నారు.