చంద్రుడినే అమ్మేస్తున్నాడు: ఆకాశంలో ప్లాట్లు వేసి కోట్లు సంపాదిస్తున్న డెన్నిస్ హోప్!
1967 ఒప్పందం ప్రకారం అంతరిక్షం అనేది మానవాళి అంతటికీ చెందిన ఉమ్మడి ఆస్తి. ఏ వ్యక్తి కూడా దానిపై సొంత హక్కులు కలిగి ఉండటానికి చట్టం అనుమతించదు.
ఒక వ్యక్తికి విడాకులయ్యాయి, చేతిలో చిల్లిగవ్వ లేదు.. కానీ ఏదో ఒక ఆస్తి అమ్మి డబ్బు సంపాదించాలనుకున్నాడు. కిటికీలోంచి కనిపిస్తున్న చంద్రుడిని చూసి, "అతడిని నేనే ఎందుకు అమ్మకూడదు?" అని ఆలోచించాడు. వినడానికి ఇది ఏదో సినిమా కామెడీ సీన్ లా ఉన్నా, డెన్నిస్ హోప్ అనే అమెరికన్ విషయంలో ఇది అక్షరాలా నిజం. 1980లో ఆయనకు వచ్చిన ఈ వింత ఆలోచన, ఆయనను అనతికాలంలోనే కోటీశ్వరుడిని చేసింది. అంతర్జాతీయ చట్టాల్లోని చిన్న లొసుగును పట్టుకుని, ఏకంగా చంద్రుడిపై ఎకరాల కొద్దీ ప్లాట్లు అమ్మడం మొదలుపెట్టారు.
చట్టంలోని లొసుగు: 'ఔటర్ స్పేస్ ట్రీటీ'
హోప్ తన వ్యాపారానికి పునాదిగా 1967 నాటి 'ఔటర్ స్పేస్ ట్రీటీ'ని ఎంచుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఏ దేశమూ చంద్రుడిపై సార్వభౌమాధికారాన్ని క్లెయిమ్ చేయకూడదు. అయితే, దేశాల గురించి ప్రస్తావించిన ఆ చట్టం, వ్యక్తుల గురించి ఏమీ చెప్పలేదని హోప్ వాదించారు. "చంద్రుడు అందరిదీ అంటే అది ఎవరిదీ కాదు (యజమాని లేని భూమి)" అని భావించిన ఆయన, నేరుగా ఐక్యరాజ్యసమితికి తన క్లెయిమ్ పంపారు. చంద్రుడు, ఇతర గ్రహాలపై తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని, వాటిని చిన్న భాగాలుగా చేసి అమ్ముతానని వివరించారు. దానికి వారి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడంతో, అదే మౌన సమ్మతిగా భావించి విక్రయాలు ప్రారంభించారు.
ప్రముఖుల కొనుగోళ్లు.. గెలాక్సీ ప్రభుత్వం ఏర్పాటు
అప్పటి నుండి హోప్ సుమారు 12 మిలియన్ డాలర్లు (రూ. 111 కోట్లు) సంపాదించారు. ఆయన దగ్గర భూమి కొన్నవారిలో సామాన్యులే కాదు, రోనాల్డ్ రీగన్, జిమ్మీ కార్టర్ వంటి అమెరికా మాజీ అధ్యక్షులు, హాలీవుడ్ స్టార్లు కూడా ఉండటం విశేషం. కేవలం భూమిని అమ్మడమే కాకుండా, తన ఆస్తిదారుల కోసం 'గెలాక్సీ ప్రభుత్వం' అనే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. చంద్రుడి మ్యాప్‌పై కళ్ళు మూసుకుని వేలు పెట్టడం ద్వారా ప్లాట్లు కేటాయించే ఈయన పద్ధతి శాస్త్రీయంగా లేకపోయినా, వేలాది మందిని ఆకర్షించింది.
చట్టపరమైన సవాళ్లు: అది సాధ్యమేనా?
అయితే, హోప్ వ్యాపారం జోరుగా సాగుతున్నప్పటికీ, చట్టపరంగా ఇది నిలబడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 1967 ఒప్పందం ప్రకారం అంతరిక్షం అనేది మానవాళి అంతటికీ చెందిన ఉమ్మడి ఆస్తి. ఏ వ్యక్తి కూడా దానిపై సొంత హక్కులు కలిగి ఉండటానికి చట్టం అనుమతించదు. అంతరిక్షంలో ఖనిజాల వెలికితీత వంటి వాణిజ్య కార్యకలాపాలపై ఇంకా స్పష్టమైన నిబంధనలు రానప్పటికీ, చంద్రుడిపై 'ప్లాట్ల రిజిస్ట్రేషన్' అనేది కేవలం ఒక ఊహాత్మక వ్యాపారం లేదా వినోదం మాత్రమేనని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఏది ఏమైనా, ఒక చిన్న ఆలోచనతో ఆకాశంలో అద్భుతాలు సృష్టించిన హోప్ కథ మాత్రం ఒక వింతే!