ఎవరెస్టు పైన కూడా స్కాములే: ట్రెక్కర్ల పొట్ట కొట్టి రూ.180 కోట్లు కొట్టేసిన 'హెలికాప్టర్ మాఫియా'!
ట్రెక్కర్లను హెలికాప్టర్లలో కిందకు తరలించి, అవసరం లేకపోయినా భారీ మెడికల్ బిల్లులు సృష్టిస్తారు. ఆ తర్వాత ట్రెక్కర్ల ఇన్సూరెన్స్ కంపెనీల నుండి లక్షలాది రూపాయలను క్లెయిమ్ చేసుకుంటారు.
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్.. పర్వతారోహకులకు అది ఒక కల. కానీ, ఆ కలను కొందరు ఏజెన్సీలు, షెర్పాలు కాసుల కక్కుర్తితో 'నరకం'గా మార్చేశారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో జరుగుతున్న ఒక భారీ స్కామ్‌ను నేపాల్ పోలీసులు బయటపెట్టారు. కేవలం మూడేళ్లలోనే ఇన్సూరెన్స్ కంపెనీల నుండి ఏకంగా రూ.180 కోట్లు కొల్లగొట్టిన ఈ "హెలికాప్టర్ రెస్క్యూ స్కామ్" ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన వారే, ట్రెక్కర్ల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
ఆహారంలో బేకింగ్ సోడా కలుపుతన్నారు
ఈ స్కామ్ ప్లాన్ వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. పర్వతారోహణకు వచ్చే ట్రెక్కర్లకు ఏజెన్సీలు ఇచ్చే ఆహారంలో కావాలనే 'బేకింగ్ సోడా'ను అధిక మోతాదులో కలిపేస్తున్నారు. ఈ సోడా వల్ల ట్రెక్కర్లకు తీవ్రమైన వికారం, కడుపునొప్పి, డయేరియా వంటి లక్షణాలు మొదలవుతాయి. ఎత్తైన ప్రదేశాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల వచ్చే 'ఆల్టిట్యూడ్ సిక్నెస్' (Altitude Sickness) లక్షణాలు కూడా ఇలాగే ఉంటాయి. దీంతో ట్రెక్కర్లు తాము అనారోగ్యం పాలయ్యామని భయాందోళనకు గురవుతారు. ఇదే అదునుగా భావించే సదరు ఏజెన్సీలు.. "మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, వెంటనే హెలికాప్టర్ రెస్క్యూ కావాలి" అని వారిని నమ్మిస్తారు.
ఇన్సూరెన్స్ రూపంలో లక్షలు కొల్లగొడుతున్నారు
అక్కడి నుండే అసలు దోపిడీ మొదలవుతుంది. ట్రెక్కర్లను హెలికాప్టర్లలో కిందకు తరలించి, అవసరం లేకపోయినా భారీ మెడికల్ బిల్లులు సృష్టిస్తారు. ఆ తర్వాత ట్రెక్కర్ల ఇన్సూరెన్స్ కంపెనీల నుండి లక్షలాది రూపాయలను క్లెయిమ్ చేసుకుంటారు. ఈ దందాలో కొన్ని హెలికాప్టర్ కంపెనీలు, ట్రెకింగ్ ఏజెన్సీలు మరియు ఆస్పత్రులు కూడా కుమ్మక్కయ్యాయని తేలింది. రెస్క్యూ పేరిట చేస్తున్న ఈ దారుణం వల్ల అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా నేపాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాహసం చేద్దామని వెళ్లే పర్వతారోహకుల నమ్మకాన్ని ఈ 'డబ్బు పిచ్చి' ఎలా మంటగలుపుతోందో ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం నేపాల్ ప్రభుత్వం ఈ స్కామ్ వెనుక ఉన్న అసలైన సూత్రధారుల కోసం విచారణను వేగవంతం చేసింది.