చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

The Deccan Desk·8d ago·2 min read·0
చట్టసభల్లో యువతకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

త్వరలో అమల్లోకి రాబోతున్న మహిళా రిజర్వేషన్ల తరహాలోనే, చట్టసభల్లో యువతకు సైతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కేంద్రానికి సూచించారు.

హైద‌రాబాద్‌: దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం పెరగాలంటే, చట్టసభల్లో 40 ఏళ్ల లోపు వారికి కనీసం 33 శాతం సీట్లను రొటేషన్ పద్ధతిలో రిజర్వ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించారు. గోవాలో జరుగుతున్న కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) పశ్చిమ ప్రాంత సదస్సులో 'దేశాభివృద్ధిలో యువ శాసనకర్తల పాత్ర' అనే అంశంపై ఆయన ప్రసంగించారు.

వయసు అంతరంపై ఆందోళన

సగటు భారతీయుడి వయసు 32 ఏళ్లు కాగా, లోక్‌సభ సభ్యుల సగటు వయసు 56, ఏపీ శాసనసభ్యుల సగటు వయసు 53 ఏళ్లుగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సగటు పౌరుడికి, ప్రజాప్రతినిధులకు మధ్య వయసులో దాదాపు 20 ఏళ్ల వ్యత్యాసం ఉండటంపై అందరూ ఆలోచించాలన్నారు. ప్రస్తుత 18వ లోక్‌సభలో 40 ఏళ్ల లోపు యువత కేవలం 11 శాతం మాత్రమే ఉండగా, ఏపీ అసెంబ్లీలో ఇది 7 శాతానికే పరిమితమైందని ఆయన గణాంకాలతో వివరించారు.

రాజకీయాల పట్ల యువత విముఖత

చట్టసభల్లో కొందరు శాసనసభ్యుల ప్రవర్తన కారణంగా యువత రాజకీయాలను ఏవగించుకుంటున్నారని స్పీకర్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల పనితీరు ఆదర్శప్రాయంగా ఉంటేనే రాజకీయాల పట్ల యువతకు గౌరవం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశలో రాజకీయాలకు దాదాపు తెరపడటం, విశ్వవిద్యాలయాల నుంచి కొత్త నాయకత్వం రాకపోవడం యువత ప్రాతినిధ్యం తగ్గడానికి ప్రధాన కారణాలని విశ్లేషించారు.

సొంత అనుభవం - ఎన్టీఆర్ స్పూర్తి

1982లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు యువతకు పెద్దపీట వేయడం వల్లే, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తాను కేవలం 25 ఏళ్లకే ఎమ్మెల్యేను కాగలిగానని అయ్యన్నపాత్రుడు గుర్తు చేసుకున్నారు. సరైన అవకాశం కల్పిస్తే యువత తప్పకుండా అద్భుతంగా రాణిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మహిళా రిజర్వేషన్ తరహాలోనే యువ కోటా

త్వరలో అమల్లోకి రాబోతున్న మహిళా రిజర్వేషన్ల తరహాలోనే, చట్టసభల్లో యువతకు సైతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఈ ఆలోచన కొన్ని విమర్శలకు దారితీసినప్పటికీ, విభిన్నంగా ఆలోచించి యువతను చట్టసభల్లోకి తీసుకువస్తేనే కొత్త ఐడియాలతో మెరుగైన భవిష్యత్తుకు పునాదులు పడతాయని ఆయన స్పష్టం చేశారు.

Comments (0)