కేరళ ప్రచార బరిలో సీఎం రేవంత్ రెడ్డి: పినరయి విజయన్ పాలనపై నిప్పులు.. తెలంగాణ సంక్షేమ పథకాలపై బహిరంగ సవాల్
ఈ ఎన్నికలు కేరళ, తెలంగాణ మధ్య కాదని, యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
తిరువనంతపురం: కేరళలోని కోవలంలో జరిగిన యూడీఎఫ్ (UDF) ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూనే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన విజయన్ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు.
విజయన్ హయాం ముగిసింది..
కేరళలో గత 120 నెలలుగా కొనసాగుతున్న పినరయి విజయన్ పాలన పూర్తిగా వైఫల్యానికి ప్రతీకగా నిలిచిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. పినరయి వైదొలిగే సమయం ఆసన్నమైందని, కేరళలో కాంగ్రెస్ మూడింట రెండొంతుల మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీలు అందించిన ఉత్తమ పాలనను మళ్ళీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సరైన ఉపాధి అవకాశాలు లేక విద్యావంతులైన యువత విదేశాలకు వలస పోవడం వల్ల కేరళలో కేవలం వృద్ధులు, చిన్నపిల్లలే కనిపిస్తున్నారని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
పినరయి విజయన్‌కు బహిరంగ సవాల్
తెలంగాణలో తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కేరళ కమ్యూనిస్టు నేతలు వచ్చి పరిశీలించాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. "నేను పినరయి విజయన్‌తో పాటు కేరళ కమ్యూనిస్టు మహిళా నేతలను తెలంగాణకు ఆహ్వానిస్తున్నాను. మీరు రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్లి మా పాలనను చూడవచ్చు" అని సవాలు విసిరారు. తెలంగాణలో ఇప్పటికే 67 వేల ఉద్యోగాల భర్తీ చేశామని, 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,670 కోట్ల రుణమాఫీ చేశామని ఆయన వివరించారు.
సంక్షేమ పాలనపై స్పష్టమైన హామీ
తెలంగాణలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి, మౌలిక వసతులు, ఉద్యోగ నియామకాలపై తమకు స్పష్టమైన విజన్ ఉందని తెలిపారు. ఈ ఎన్నికలు కేరళ, తెలంగాణ మధ్య కాదని, యూడీఎఫ్ మరియు ఎల్డీఎఫ్ సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని స్పష్టం చేశారు. తాము చేస్తున్న పనులను ధైర్యంగా చెబుతున్నామని, దీనిపై విజయన్ సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.