తెలంగాణ పొలిటికల్ వార్: కాస్కో బిడ్డ - పునరేకీకరణ యుద్ధమే!
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'వ్యూహం వర్సెస్ వేగం'గా మారాయి. కేసీఆర్ తన అనుభవంతో మళ్లీ పట్టు సాధించాలని చూస్తుంటే, రేవంత్ రెడ్డి తన దూకుడుతో పాత వ్యవస్థను తుడిచిపెట్టాలని చూస్తున్నారు.
దాదాపు ఏడాది కాలంగా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్, జగిత్యాల వేదికగా తన రాజకీయ పునరాగమనాన్ని చాటారు. కేసీఆర్ ప్రసంగంలో ఈసారి కేవలం విమర్శలు మాత్రమే లేవు, ప్రభుత్వంపై ఒక రకమైన 'అపరాధ భావం' కలిగించే వ్యూహం కనిపించింది. "కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలాంటి రాష్ట్రాన్ని అప్పగిస్తే.. ఇప్పుడు చిన్నాభిన్నం చేశారు" అన్న ఆయన వ్యాఖ్యలు, సామాన్య ప్రజల్లో బీఆర్ఎస్ హయాంలో అంతా బాగుండే అనే కలిగించే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడతల్లో రైతు భరోసా నిధులు విడుదల చేసినా కూడా.. ఇదే అంశాన్ని కేసీఆర్ రాజకీయంగా వాడుకొనే ప్రయత్నం చేశారు. తాము సభ పెడితే తప్ప నిధులు విడుదల కావడం లేదని చెప్పడం ద్వారా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా, తానే ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాననే సంకేతాన్ని పంపే ప్రయత్నం చేశారు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతను చేర్చుకోవడం ద్వారా 'రాజకీయ పునరేకీకరణ' అనే కొత్త నినాదాన్ని ఆయన తెరపైకి తెచ్చారు.
కాటారం కౌంటర్: రేవంత్ రెడ్డి 'పాపాల భైరవుడు' ధ్వజం
కేసీఆర్ అస్త్రాలను అంతే వేగంతో తిప్పికొట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ సంధించిన విమర్శలకు రేవంత్ రెడ్డి 'ఎన్‌కౌంటర్' శైలిలో బదులిచ్చారు. కేసీఆర్‌ను 'పాపాల భైరవుడు' అని సంబోధించడం ద్వారా, గత పదేళ్ల పాలనలో జరిగిన లోపాలను ప్రజలకు మళ్లీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ 'అనుభవం' గురించి మాట్లాడుతుంటే, రేవంత్ 'అవినీతి మరియు విధ్వంసం' గురించి మాట్లాడుతున్నారు. 2029 మాత్రమే కాదు, 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పడం ద్వారా తన కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాకుండా, బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా 'వంద మీటర్ల లోతున పాతరేస్తాం' వంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి పార్టీ మార్పును కూడా రేవంత్ తీవ్రంగా పరిగణిస్తూ, అది రాజకీయ వ్యభిచారం అన్నట్లుగా విమర్శలు గుప్పించారు.
ఈ పోరు ఎటు దారి తీస్తుంది?
ఈ రెండు సభల విశ్లేషణ చూస్తే, తెలంగాణలో ప్రతిపక్షం ఖాళీ కాలేదని కేసీఆర్ నిరూపించాలనుకుంటుండగా, ఆ ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా చేస్తానని రేవంత్ సవాల్ విసురుతున్నారు. ఇద్దరు నేతలు కూడా 'రైతు'నే కేంద్రబిందువుగా చేసుకున్నారు. కేసీఆర్ రైతుబంధు గురించి ప్రశ్నిస్తుండగా, రేవంత్ రెడ్డి రుణమాఫీతోపాటు రైతు భరోసాను విజయవంతంగా అమలు చేస్తున్నామని గణంకాలతో సహా చెబుతున్నారు. రాజకీయ సిద్ధాంతాల కంటే వ్యక్తిగత దూషణలు, 'చావడం', 'పాతరేయడం' వంటి పదజాలం వాడటం రాష్ట్రంలో రాజకీయ వేడి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
మైండ్ గేమ్ - ప్రజల నాడి పట్టుకొనేదెవరు?
మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు 'వ్యూహం వర్సెస్ వేగం'గా మారాయి. కేసీఆర్ తన అనుభవంతో మళ్లీ పట్టు సాధించాలని చూస్తుంటే, రేవంత్ రెడ్డి తన దూకుడుతో పాత వ్యవస్థను తుడిచిపెట్టాలని చూస్తున్నారు. జగిత్యాల, కాటారం సభలు కేవలం ఆరంభం మాత్రమే అని చెప్పవచ్చు. మున్ముందు ఈ పోరు మరింత క్లిష్టంగా, ఘర్షణాత్మకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజా క్షేత్రంలో ఎవరికి ఆశీర్వాదం లభిస్తుందో కాలమే నిర్ణయించనుంది. ఈ 'మైండ్ గేమ్'లో ప్రజల నాడిని ఎవరు పట్టుకుంటే వారికే విజయం వరిస్తుంది. పాత జ్ఞాపకాలతో కేసీఆర్ పూర్వవైభవం సంపాదిస్తారా? లేక విపక్ష హోదా కూడా లేకుండా చేస్తానన్న వాగ్దానాలతో రేవంత్ తన హవాకొనసాగిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.