మూడేళ్లలో మూడోసారి: ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ - జగిత్యాల వేదికగా ప్రజా ఆశీర్వాద సభ
జగిత్యాల సభ ఆయన రాజకీయ పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందా లేక కేవలం మరో ముచ్చటైన 'వార్షిక పర్యటన'గా మిగిలిపోతుందో వేచి చూడాలి.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా వెలిగిన గులాబీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీరు ఇప్పుడు సొంత పార్టీ శ్రేణుల్లోనే కాదు, సామాన్య ప్రజల్లోనూ విస్మయాన్ని కలిగిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో గడిపిన దానికంటే ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారనే విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అదే 'అజ్ఞాత' సంస్కృతిని కొనసాగిస్తుండటం గమనార్హం. 2023లో అధికారం చేజారిన తర్వాత, ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రజలకు కనిపిస్తూ.. తన రాజకీయ ప్రస్థానాన్ని 'సీజనల్ ఈవెంట్'గా మార్చేశారనే వాదనలకు బలం చేకూరుస్తోంది.
ఫామ్‌హౌస్ గడప దాటని రాజకీయం
ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లారని, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌ను గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఫిబ్రవరిలో 'ఛలో నల్గొండ'తో మొదలుపెట్టి, లోక్‌సభ ఎన్నికల వేళ కొద్దిరోజులు కనిపించినా, ఆ తర్వాత మళ్ళీ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. 2025 ఏప్రిల్‌లో వరంగల్ రజతోత్సవ సభలో మెరిసిన ఆయన, మళ్ళీ ఏడాది తర్వాత ఇప్పుడు 2026 ఏప్రిల్ 20న జగిత్యాల సభ ద్వారా మూడోసారి జనం ముందుకు వస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవాల్సింది పోయి, కేవలం పార్టీ అవసరాల కోసం లేదా చేరికల కోసమే ఆయన బయటకు రావడంపై విమరర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్‌కు ప్రజలు అవసరం లేదని, వారి ఓట్లు మాత్రమే అవసరమని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
ఏడాదికి ఒక సభ.. ఇది నాయకత్వమా?
గతంలో ప్రజలే తన బలం అని చెప్పుకున్న నేత, ఇప్పుడు ఫామ్‌హౌస్ నుంచి కొద్దిమంది నేతలతో మంతనాలకే పరిమితమవడం ఆయన నాయకత్వ పంథాలోని లోపాన్ని ఎత్తిచూపుతోంది. ఒకప్పుడు ఉద్యమ సెగతో ఊగిపోయిన తెలంగాణ గడ్డపై, నేడు ప్రతిపక్ష నేతగా ఆయన గొంతు మూగబోవడం వెనుక అంతర్యం ఏమిటి? మూడు సంవత్సరాల్లో కేవలం మూడు సభలకే పరిమితమవ్వడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చే గౌరవమా? లేక అధికారం లేని చోట తానుండలేననే సంకేతమా? అన్నది చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల సభకు వస్తున్న ఆయన, కేవలం మైకు ముందు తన వాగ్ధాటిని ప్రదర్శించి మళ్ళీ ఫామ్‌హౌస్‌కు వెళ్ళిపోతే, ప్రజల విశ్వాసాన్ని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జగిత్యాల గర్జన.. ఉనికి కోసమా? ఉద్ధరణ కోసమా?
నేడు జగిత్యాల వేదికగా జరగనున్న సభలో కేసీఆర్ మళ్ళీ తన మార్కు విమర్శలతో అధికార పార్టీపై విరుచుకుపడే అవకాశం ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో గడిచిన రెండేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన మౌనం వహించి, ఇప్పుడు కేవలం ఒక చేరిక కోసం సభ నిర్వహించడం ఆయన రాజకీయ స్వార్థాన్ని సున్నితంగా బయటపెడుతోంది. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా వారి పక్షాన నిలవాల్సిన నాయకుడు, కేవలం ఎన్నికలు లేదా పార్టీ పండగల సమయంలోనే బయటకు రావడం చూస్తుంటే.. ప్రజలతో ఆయనకు ఉన్న పేగు బంధం తెగిపోయిందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ క్రమంలో జగిత్యాల సభ ఆయన రాజకీయ పునరుజ్జీవనానికి నాంది పలుకుతుందా లేక కేవలం మరో ముచ్చటైన 'వార్షిక పర్యటన'గా మిగిలిపోతుందో వేచి చూడాలి.