రామాయణం గురించి ప్రకాష్ రాజ్ ఏమన్నారు..? ఆయనపై కేసు ఎందుకు నమోదైంది..?
ఉత్తర-దక్షిణ భారత రాజకీయాల నేపథ్యంలో ఆయన రామాయణ ఘట్టాన్ని వక్రీకరిస్తూ మాట్లాడారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రామాయణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఏడాది కేరళలో జరిగిన ఓ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా (ఏప్రిల్ 16, గురువారం) పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉత్తర-దక్షిణ భారత రాజకీయాల నేపథ్యంలో ఆయన రామాయణ ఘట్టాన్ని వక్రీకరిస్తూ మాట్లాడారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
రామాయణాన్ని వక్రీకరించారనే ఆరోపణలు
కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో సీనియర్ జర్నలిస్ట్ షహీనా కె.కెతో మాట్లాడుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ ఒక చిన్నారుల థియేటర్ గ్రూప్ ప్రదర్శించిన రామాయణ వెర్షన్ గురించి వివరించారు. ఆ కథనం ప్రకారం.. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతీయులుగా, రావణుడు దక్షిణ భారతీయుడిగా చిత్రీకరించారు. రాముడు, లక్ష్మణుడు అడవిలో ఆకలితో ఉండి రావణుడి తోటలో పండ్లు కోసుకుని తిన్నారని, ఆ సమయంలో శూర్పణఖ వచ్చి వారిని నిలదీసిందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో పండ్ల ధరగా $2,000 ప్లస్ జీఎస్‌టీ (GST) చెల్లించాలని శూర్పణఖ అడిగినట్లు, ఆ తర్వాత రావణుడు వారికి డిస్కౌంట్ ఇచ్చాడని ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చివరగా రావణుడు వారితో.. "మీరు పండ్లు తినడానికి వచ్చారు, తిన్నారు కదా.. ఇప్పుడు ఆ విత్తనాలను నాటి, చెట్లను పెంచి తిరిగి మీ ప్రాంతానికి వెళ్ళిపోండి" అని అన్నట్లు ప్రకాష్ రాజ్ వివరించారు.
కేసు నమోదుకు దారితీసిన అంశాలు
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు కేవలం హాస్యం కోసం చేసినవి కావని, ఉత్తర భారతీయులు దక్షిణ భారత్‌కు వచ్చి ఇక్కడి సంస్కృతిని గౌరవించాలని, పని ముగించుకుని తిరిగి వెళ్ళిపోవాలే తప్ప 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' వంటి అంశాల గురించి మాట్లాడకూడదనే రాజకీయ కోణంలో ఆయన ఈ కథను అల్లారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అడ్వకేట్ అమితా సచ్‌దేవా ప్రకాష్ రాజ్‌పై ఫిర్యాదు చేశారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే హిందూ దేవుళ్లను, పవిత్ర రామాయణాన్ని కించపరిచారని, సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించబోమని ఆమె పేర్కొన్నారు.
సినిమాలపై ప్రభావం: బాయ్‌కాట్ సెగ
ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన 'వారణాసి' చిత్రంలో శివుడి పాత్రలో నటిస్తున్నారు. పవిత్ర రామాయణాన్ని ఎగతాళి చేసిన వ్యక్తిని ఆ పాత్ర నుంచి తొలగించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఆయన నటించిన ఇతర సినిమాలను కూడా బహిష్కరించాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు.