మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌తో బీసీలు, ముస్లిం వ‌ర్గాలు న‌ష్ట‌పోతాయా..?

The Deccan Desk·8d ago·1 min read·1
మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌తో బీసీలు, ముస్లిం వ‌ర్గాలు న‌ష్ట‌పోతాయా..?

మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు కేవలం లింగ సమానత్వాన్ని సాధిస్తాయే తప్పా, సామాజిక న్యాయాన్ని పూర్తిస్థాయిలో అందించలేకపోవచ్చు అనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

చ‌ట్టస‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ల అమ‌లు వల్ల బీసీలు, ముస్లిం వర్గాల రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ చట్టంలో ఎస్సీ, ఎస్టీ మహిళలకు అంతర్గత రిజర్వేషన్లు కల్పించారు కానీ, బీసీ మహిళలకు అటువంటి ప్రత్యేక కోటా ఏదీ కేటాయించలేదనే చ‌ర్చ న‌డుస్తోంది.

దీనివల్ల రిజర్వు చేయబడే 33 శాతం స్థానాల్లో అధిక శాతం కేవలం అగ్రవర్ణాలకు చెందిన మహిళలే దక్కించుకునే అవకాశం ఉందని, ఫలితంగా చట్టసభల్లో ఇప్పటికే తక్కువ ప్రాతినిధ్యం ఉన్న బీసీ వర్గాల గొంతుక మరింత క్షీణించే ప్రమాదం ఉందని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ముస్లిం వర్గాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం..!

ఇప్ప‌టికే ముస్లింలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. మహిళా రిజర్వేషన్లలో ముస్లిం మహిళలకు ప్రత్యేక ఉప-కోటా లేకపోవడం వల్ల, వారు సాధారణ కేటగిరీలో ఇతర బలమైన సామాజిక వర్గాలతో పోటీ పడాల్సి ఉంటుంది. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం కారణంగా ముస్లిం మహిళలు ఈ పోటీలో వెనుకబడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల మొత్తం ముస్లిం వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం గతంలో కంటే గణనీయంగా తగ్గే అవకాశం ఉందనే వాద‌న వినిపిస్తోంది.

కోటాలో కోటా ఉంటేనే సమాన అవకాశాలు

మరో ప్రధాన అంశం ఏమిటంటే, ఈ రిజర్వేషన్ల అమలు వల్ల ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీలు, ముస్లిం పురుష నేతలు తమ స్థానాలను కోల్పోవాల్సి రావచ్చు. ఒకవేళ ఆ స్థానాలు మహిళలకు రిజర్వు అయినప్పుడు, అదే సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకత్వం సిద్ధంగా లేకపోతే, ఆ స్థానాలు ఇతర వర్గాల చేతుల్లోకి వెళ్తాయి.

మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు కేవలం లింగ సమానత్వాన్ని సాధిస్తాయే తప్పా, సామాజిక న్యాయాన్ని పూర్తిస్థాయిలో అందించలేకపోవచ్చు అనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అందుకే, "కోటాలో కోటా" ఉంటేనే అన్ని సామాజిక వర్గాల మహిళలకు సమాన అవకాశాలు లభిస్తాయనే వాదన వినిపిస్తోంది.

Comments (0)