"మా మధ్య ప్రేమ ఉంటే ఈపాటికి మాకు పిల్లలు ఉండేవారు": చిరాగ్ పాశ్వాన్‌తో సంబంధంపై కంగనా రనౌత్
వీరిద్దరి మధ్య రొమాన్స్ నడుస్తోందన్న వార్తలను కొట్టిపారేయడమే కాకుండా, ఒకవేళ అది నిజమై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తనదైన శైలిలో వివరించారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తనపై వస్తున్న ప్రేమ పుకార్లకు తనదైన శైలిలో ఫుల్‌స్టాప్ పెట్టారు. గత కొంతకాలంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ఆమె ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె తాజాగా స్పందించారు. వీరిద్దరి మధ్య రొమాన్స్ నడుస్తోందన్న వార్తలను కొట్టిపారేయడమే కాకుండా, ఒకవేళ అది నిజమై ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తనదైన శైలిలో వివరించారు.
వైరల్ ఫోటోలు.. మొదలైన పుకార్లు
2024లో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్ ఎదురెదురు పడినప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆ సమయంలో వారు నవ్వుకుంటూ ముచ్చటించిన దృశ్యాలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనికి తోడు గతంలో వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించిన నేపథ్యం ఉండటంతో, వీరి మధ్య ఏదో ప్రత్యేక బంధం ఉందంటూ నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు.
మేము కేవలం స్నేహితులమే: కంగనా
తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా ఈ పుకార్లపై నేరుగా స్పందించారు. చిరాగ్ పాశ్వాన్ తనకి మంచి స్నేహితుడని ఆమె తేల్చి చెప్పారు. "చిరాగ్ నా స్నేహితుడు, మా మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. ఒకవేళ మా మధ్య నిజంగానే ప్రేమ ఉండి ఉంటే, ఈపాటికి మాకు పిల్లలు కూడా ఉండేవారు" అంటూ ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు.
పదేళ్ల క్రితమే చిరాగ్ తనతో కలిసి సినిమా చేశారని, ఒకవేళ ఆ రోజే తాము ప్రేమించుకొని ఉంటే ఈ సమయానికి తాము తల్లిదండ్రులం అయ్యేవాళ్లమని ఆమె గుర్తు చేశారు. ఒకే సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో చిరాగ్ పక్కన ఉన్నప్పుడు తనకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని, ఆయనను చూస్తే సంతోషంగా అనిపిస్తుందని కంగనా పేర్కొన్నారు.
సినిమా నుంచి పార్లమెంట్ వరకు..
బిహార్‌కు చెందిన చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రిగా, హాజీపూర్ ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన 2011లో 'మిలే నా మిలే హమ్' అనే చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ చిత్రంలో కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమా తర్వాత చిరాగ్ రాజకీయాల్లోకి ప్రవేశించగా, కంగనా స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఇప్పుడు వీరిద్దరూ ఎంపీలుగా ఒకే కూటమిలో ఉండటం విశేషం.