అల్లు అర్జున్ క్రేజ్: మెగా నీడ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు.. ఆ అభిమానం ఎవరిది?

The Deccan Desk·9d ago·2 min read·0
అల్లు అర్జున్ క్రేజ్: మెగా నీడ నుంచి గ్లోబల్ ఐకాన్ వరకు.. ఆ అభిమానం ఎవరిది?

ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు గ్రౌండ్ లెవల్‌లో పరిశీలిస్తే, అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ చాలా స్వతంత్రంగా కనిపిస్తోంది.

హైదరాబాద్: టాలీవుడ్‌లో ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక సంచలనం. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా, మెగా ఫ్యామిలీ మద్దతుతో వెండితెరకు పరిచయమైన బన్నీ, ఇప్పుడు ఏకంగా 'నేషనల్ అవార్డ్' గ్రహీతగా, గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగారు. అయితే, అల్లు అర్జున్ వెనుక ఉన్న ఈ భారీ సైన్యం అసలు మెగా అభిమానులా..? లేక ఆయన సొంతంగా సంపాదించుకున్నవారా? అనే చర్చ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.

'స్టైలిష్ స్టార్' ఇమేజ్‌

కెరీర్ ఆరంభంలో 'గంగోత్రి' సినిమా సమయంలో మెగా అభిమానుల అండదండలు అల్లు అర్జున్‌కు పూర్తిస్థాయిలో లభించాయి. ఆ సమయంలో మెగాస్టార్ మద్దతు లేనిదే అల్లు వారసుడికి గుర్తింపు రావడం అసాధ్యమని అంతా భావించారు. కానీ, తన రెండో చిత్రం 'ఆర్య'తో బన్నీ తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. తనదైన స్టైల్, గ్రేస్ మరియు డ్యాన్స్‌తో యువతను ఆకట్టుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన 'స్టైలిష్ స్టార్' ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు.

బ‌న్నీ సొంత కృషి నిద‌ర్శ‌నం

క్రమంగా, సినిమాల ఎంపికలో అల్లు అర్జున్ చూపించిన వైవిధ్యం ఆయనను మెగా కుటుంబం అనే చట్రం నుంచి బయటకు తెచ్చింది. కేరళలో 'మల్లు అర్జున్'గా పేరు తెచ్చుకుని అక్కడ ఏ ఇతర తెలుగు హీరోకూ లేని స్థాయిలో మార్కెట్ సృష్టించుకోవడం బన్నీ సొంత కృషికే నిదర్శనం. ముఖ్యంగా 'పుష్ప' సినిమా తర్వాత ఈ ఫ్యాన్ బేస్ కేవలం సౌత్ ఇండియాకే పరిమితం కాకుండా ఉత్తరాదిని కూడా చుట్టేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు గ్రౌండ్ లెవల్‌లో పరిశీలిస్తే, అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ చాలా స్వతంత్రంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మెగా ఫ్యాన్స్‌లో భాగంగా ఉన్నవారే ఇప్పుడు బన్నీకి ప్రత్యేక అభిమానులుగా మారినప్పటికీ, ఇప్పుడు అల్లు అర్జున్ కోసం మాత్రమే నిలబడే ఒక కొత్త తరం అభిమాన వర్గం (AA Fans) బలంగా తయారైంది.

మెగా హీరోల‌ను మించి బ‌న్నీ అడుగులు

నేడు అల్లు అర్జున్ సాధిస్తున్న వసూళ్లు మరియు క్రేజ్ చూస్తుంటే, ఆయన ఇతర మెగా హీరోల కంటే ఒక అడుగు ముందే ఉన్నారనడంలో సందేహం లేదు. కొన్ని సందర్భాల్లో మెగా ఫ్యాన్స్‌తో తలెత్తిన చిన్నపాటి విబేధాలు లేదా 'చెప్పను బ్రదర్' వంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆయన ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే, మొదట్లో మెగా ఫ్యాన్స్ మద్దతు పునాదిగా ఉన్నప్పటికీ, ఇప్పుడు అల్లు అర్జున్ తన కష్టం, ప్రతిభ మరియు వినూత్నమైన బ్రాండింగ్‌తో ఒక సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని స్పష్టమవుతోంది. ఆయన అభిమానులు ఇప్పుడు కేవలం ఒక కుటుంబానికి చెందినవారు కాదు, 'ఐకాన్ స్టార్' సృష్టించిన మేజిక్‌కు బానిసలైన వారు.

Comments (0)