ఈ వేసవిలో విషపూరిత మామిడి పండ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి!
ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఎథిలిన్ సాచెట్లను నేరుగా కాయల మధ్య ఉంచడం వల్ల, వాటి నుండి వెలువడే రసాయన వాయువు కాయ పైపొరను రంగు మార్చేస్తుంది.
ఈ వేసవిలో విషపూరిత మామిడి పండ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి!
వేసవి కాలం రాగానే అందరి కళ్ళు నోరూరించే మామిడి పండ్ల కోసం వెతుకుతాయి. కానీ, పండ్ల రాజుగా పిలవబడే మామిడి ప్రస్తుతం సామాన్యుల పాలిట ఆరోగ్య సంకటంగా మారుతోంది. కేవలం లాభాలే ధ్యేయంగా కొంతమంది స్వార్థపూరిత వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సహజ సిద్ధంగా పండాల్సిన మామిడి పండ్లను కృత్రిమంగా, కాల్షియం కార్బైడ్ మరియు ఎథిలిన్ సాచెట్ల (Ethylene Sachets) సహాయంతో వేగంగా పండిస్తున్నారు. రోడ్డు పక్కన స్టాళ్లలో నిగనిగలాడుతూ బంగారు రంగులో కనిపిస్తున్నాయని మీరు ఆ పండ్లను కొంటే, నేరుగా అనారోగ్యాన్ని మీ ఇంటికి ఆహ్వానించినట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎథిలిన్ సాచెట్ల మాయాజాలం
చాలామంది వ్యాపారులు ఇప్పుడు 'కార్బైడ్ ఫ్రీ' అని చెబుతూ ఎథిలిన్ సాచెట్లను వాడుతున్నారు. నిజానికి శాస్త్రీయ పద్ధతిలో ఎథిలిన్ గ్యాస్‌ను నియంత్రిత పద్ధతిలో వాడాలి. కానీ, వ్యాపారులు ఈ సాచెట్లను నేరుగా పండ్ల మధ్యలో పెట్టడం వల్ల పండు పైన రంగు మారుతుంది కానీ, లోపల మాత్రం పచ్చిగా, విషపూరితంగా ఉండిపోతుంది. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, వికారం, వాంతులు మరియు విరేచనాలు వంటి తక్షణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో "ఆర్గానిక్" అనే లేబుల్‌తో అమ్ముతున్న పండ్ల విషయంలో కూడా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.
గోషామాల్ అడ్డగా దందా
గోషామహల్ అడ్డగా సాగుతున్న ఈ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సాధారణంగా మామిడి కాయలు పక్వానికి రావడానికి సమయం పడుతుంది, కానీ ఇక్కడ గంటల వ్యవధిలోనే పచ్చని కాయలను పండుగా మార్చేస్తున్నారు. ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన ఎథిలిన్ సాచెట్లను (Ethylene Sachets) నేరుగా కాయల మధ్య ఉంచడం వల్ల, వాటి నుండి వెలువడే రసాయన వాయువు కాయ పైపొరను రంగు మార్చేస్తుంది. దీంతో అవి చూడగానే కళ్లు చెదిరే పసుపు రంగులో, అచ్చం సహజంగా పండిన పండ్లలాగే భ్రమ కలిగిస్తాయి. అయితే, ఈ పద్ధతిలో కేవలం పండు రంగు మారుతుందే తప్ప లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది.
హైదరాబాద్ పోలీసుల నిఘా
ఈ రకమైన కల్తీని అరికట్టేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం ఇప్పటికే నడుం బిగించింది. H-FAST (Hyderabad Food Safety and Adulteration Control Team) బృందాలు మార్కెట్లపై నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. ప్రజారోగ్యంతో ఆడుకునే వ్యాపారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం బాహ్య రూపాన్ని చూసి మోసపోకుండా, పండు సహజత్వానికి సంబంధించి పూర్తి నిశ్చయత కలిగిన తర్వాతే కొనుగోలు చేయాలని వారు సూచిస్తున్నారు.