పెట్రోల్ 'ఎక్సైజ్' తగ్గింది.. కానీ మీ జేబుకు ఊరట దక్కేనా? సామాన్యుడికి లాభమా, నష్టమా?

The Deccan Desk·21d ago·2 min read·0
పెట్రోల్ 'ఎక్సైజ్' తగ్గింది.. కానీ మీ జేబుకు ఊరట దక్కేనా? సామాన్యుడికి లాభమా, నష్టమా?

ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల ధరలు 'తగ్గకపోయినా', రాబోయే రోజుల్లో భారీగా పెరగకుండాస కొంత మేర‌ అడ్డుకట్ట వేస్తుంది.

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, ఇరాన్ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్న తరుణంలోఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ భారత ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే, ప్రభుత్వం పెట్రోల్‌పై రూ. 10, డీజిల్‌పై రూ. 10 మేర అదనపు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం అనేది పైకి భారీ ఊరటగా కనిపిస్తున్నప్పటికీ, దీని వ‌ల్ల సామాన్యుల‌కు ఎలాంటి ఊర‌ట ఉండ‌దు.

ఎందుకంటే, సాధారణంగా ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పుడు పెట్రోల్ బంకుల్లో లీటరు ధర ఆ మేరకు తగ్గాలి. కానీ, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటిపోవడంతో, చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఇప్పటికే లీటరు పెట్రోల్ లేదా డీజిల్‌పై దాదాపు రూ. 48 వరకు నష్టపోతున్నట్టు ట్రేడ్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి

ధరలు ఎందుకు తగ్గవు? - కంపెనీల ఆర్థిక భారమే కారణం

ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తగ్గించిన రూ. 10 రాయితీ అనేది ఆ భారీ నష్టాన్ని కొంతమేర పూడ్చుకోవడానికి కంపెనీలకు ఉపయోగపడుతుంది తప్ప, వినియోగదారుడికి నేరుగా ధర తగ్గింపు రూపంలో చేరే అవకాశం ప్రస్తుతానికి తక్కువగా కనిపిస్తోంది. అంటే, అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరల వల్ల కంపెనీలు ఎదుర్కొంటున్న లోటును ఈ పన్ను తగ్గింపు కొంతవరకు భర్తీ చేస్తుంది. ఇప్పటికే నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు ధరలు పెంచేసిన నేపథ్యంలో, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అదే బాట పట్టకుండా కేంద్రం ఈ వెసులుబాటు కల్పించింది.

సామాన్యుడికి కలిగే అసలైన ప్రయోజనం ఏమిటి?

అయితే, ఈ నిర్ణయం వల్ల సామాన్యుడికి అసలు లాభమే లేదని అనుకోవ‌డానికి లేదు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల హర్మూజ్ జలసంధి మూతపడటం చమురు సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేసింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సమయంలో స్పందించి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించకపోయి ఉంటే, చమురు కంపెనీలు తమ నష్టాలను భరించలేక ఆ భారాన్ని నేరుగా ప్రజల నెత్తిన వేసేవి. అంటే, ఇప్పుడున్న లీట‌రు పెట్రోలు రూ. 95-100 ధరలు కాస్తా ఒక్కసారిగా రూ. 130 లేదా రూ. 140 వరకు వెళ్లే ప్రమాదం ఉండేది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల ధరలు 'తగ్గకపోయినా', రాబోయే రోజుల్లో భారీగా పెరగకుండాస కొంత మేర‌ అడ్డుకట్ట వేస్తుంది.

నిత్యావసరాల ధరలపై పరోక్ష ప్రభావం

పెట్రోలు ధ‌ర‌లు పెర‌గ‌క‌పోవ‌డం సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేయకుండా కాపాడుతుంది. ఇంధన ధరలు పెరగకపోవడం వల్ల రవాణా ఖర్చులు స్థిరంగా ఉంటాయి, తద్వారా కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటకుండా నియంత్రణలో ఉంటాయి. ఈ నిర్ణయం సామాన్యుడి జేబుకు తక్షణమే అదనపు డబ్బును మిగల్చకపోవచ్చు కానీ, యుద్ధ కాలంలో వచ్చే భారీ ధరల పెరుగుదల నుంచి కొంత ఊర‌ట క‌లిగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చి, కంపెనీలకు ఇప్ప‌టి వ‌ర‌కు క‌లిగిన న‌ష్టాలు భ‌ర్తీ అయ్యే వ‌ర‌కు కేంద్రం త‌గ్గించిన ఈ సుంకాల ప్ర‌యోజ‌నం సామాన్యుల‌కు ద‌క్కే ప‌రిస్థితిలేదు.

Comments (0)