వివాదాలకు నిలయంగా బీఆర్ఎస్: నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలేవి..?

The Deccan Desk·24d ago·2 min read·0
వివాదాలకు నిలయంగా బీఆర్ఎస్: నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలపై చర్యలేవి..?

తప్పు చేసిన వారిని వారించాల్సింది పోయి, మౌనంగా ఉండటం ద్వారా అటువంటి నేతలను పార్టీ పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితిలో వివాదాస్పద నేతల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. గత కొన్నేళ్లుగా పలువురు కీలక నేతలపై హత్యలు, దోపిడీలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి తీవ్రమైన నేరారోపణలు వస్తున్నప్పటికీ, పార్టీ అధిష్టానం వారిపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

త‌ప్పు చేసిన వారిని బీఆర్ఎస్ ర‌క్షిస్తోందా..?

తప్పు చేసిన వారిని వారించాల్సింది పోయి, మౌనంగా ఉండటం ద్వారా అటువంటి నేతలను పార్టీ పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ 'మౌనమే అంగీకారం' అనే ధోరణి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, వివాదాస్పద నేతలు మరింత బరితెగించడానికి కారణమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో అత్యంత వివాదాస్పదంగా మారిన నేతల జాబితాను పరిశీలిస్తే, వీరిలో హత్యారోపణలు సైతం ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు.

నేత‌ల వివాదాస్ప‌ద తీరు

గతంలో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు వామనరావు దంపతుల దారుణ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై గళమెత్తిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పేరు వినిపించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇంతటి తీవ్రమైన నేరాల్లో తమ నేతల పేర్లు బయటకు వచ్చినా, బీఆర్ఎస్ నాయకత్వం వారిని కనీసం సస్పెండ్ చేయకపోవడం ఆశ్చర్యకరం. దీనివల్ల నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుందనే భావన ప్రజల్లో బలపడుతోంది.

కౌషిక్ రెడ్డి నోటి దురుసు

మరోవైపు, పాడి కౌషిక్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి వంటి నేతల తీరు పార్టీకి నిరంతరం తలనొప్పిగా మారింది. కౌషిక్ రెడ్డి తరచూ నోటి దురుసుతో అధికారులను, ప్రత్యర్థులను దూషిస్తూ వివాదాల్లో నిలుస్తున్నారు. మ‌తం పేరుతో విద్వేషాల‌ను రెచ్చ‌గొట్ట‌డం, ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మాల్లో ఎమ్మెల్యేల‌పై దౌర్జ‌న్యాల‌కు దిగ‌డం వంటి చ‌ర్య‌లు మితిమీరుతున్నాయి. కౌశిక్ రెడ్డి ప్ర‌వ‌ర్త‌నా తీరుపై సొంత‌పార్టీలోనే తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నా కూడా ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.

డ్ర‌గ్స్ పాజిటివ్ వ‌చ్చినా కూడా - నో యాక్ష‌న్‌!

ఇక బీఆర్ఎస్ కీల‌క నేత‌ల డ్ర‌గ్స్ దందాను ల‌క్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ నేత‌లు త‌ర‌చుగా ఆరోప‌ణ‌లు చేస్తుంటారు. ఈ ఆరోప‌ణ‌ల్ని నిజం చేసేలా పైలెట్ రోహిత్ రెడ్డి త‌న ఫాంహౌస్‌లో డ్ర‌గ్స్ పార్టీ నిర్వ‌హించ‌డం దేశ వ్యాప్తంగా సంచ‌నంగా మారింది. పైలెట్ రోహిత్ రెడ్డికి డ్ర‌గ్స్ పాజిటివ్ వ‌చ్చినా కూడా బీఆర్ఎస్ అధిష్టానం అతనిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. కేవ‌లం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండాల‌ని చెప్పి చేతులు దులుపుకుందే త‌ప్పా.. ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసి డ్ర‌గ్స్ వంటి మాద‌క‌ద్ర‌వ్యాల‌ను సేవించే వారి ప‌ట్ల పార్టీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నే సందేశాన్ని ఇవ్వ‌లేక‌పోయింది. దీంతో ఈ డ్ర‌గ్స్ దందా బీఆర్ఎస్ కీల‌క నేత‌కు తెలిసే జ‌రుగుతోంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

ఏం సందేశం ఇస్తున్న‌ట్టు..?

వీరే కాకుండా మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూ ఆక్రమణల ఆరోపణలు, గంగుల కమలాక‌ర్‌పై గ్రానైట్ అక్రమాల విచారణలు సాగుతున్నా పార్టీలో వారి ప్రాధాన్యత తగ్గలేదు. ఇలాంటి వివాదాస్పద నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ ప్ర‌జ‌ల‌కు, స‌మాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాల‌నుకుంటోంద‌ని సామాజికవేత్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఇలాంటి వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని సామాజిక‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Comments (0)