బీఆర్‌ఎస్ హయాంలో టీఎస్‌ఐఐసీ నిధుల లూటీ: రూ. 800 కోట్లకు పైగా అక్రమాలు తేల్చిన 'కాగ్' నివేదిక

The Deccan Desk·17d ago·2 min read·0
బీఆర్‌ఎస్ హయాంలో టీఎస్‌ఐఐసీ నిధుల లూటీ: రూ. 800 కోట్లకు పైగా అక్రమాలు తేల్చిన 'కాగ్' నివేదిక

బీఆర్‌ఎస్ పాలనలో టీఎస్‌ఐఐసీ స్వయంప్రతిపత్తిని కోల్పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే వేదికగా మారిందని కాగ్ తన నివేదికలో నిగ్గుతేల్చింది.

హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC), ఇప్ప‌టి TGIIC, వేదికగా భారీ అక్రమాలు జరిగినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్‌) సంచలన విష‌యాలు వెల్లడించింది. సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ నివేదిక ప్రకారం, 2018 నుంచి 2022 మధ్య కాలంలో నిబంధనలను తుంగలో తొక్కి నిధుల మళ్లింపు, భూ కేటాయింపుల్లో ప్రైవేట్ సంస్థలకు వందల కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చినట్లు స్పష్టమైంది. పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొట్టారని కాగ్ ఎండగట్టింది.

అదానీకి అయాచిత లబ్ధి.. కారుచౌకగా భూములు

మామిడిపల్లి హార్డ్‌వేర్ పార్కులో అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ (ADSTL)కు 20 ఎకరాల భూమిని కేటాయించడంలో నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. ఎకరాకు రూ. 2.13 కోట్ల మార్కెట్ ధర ఉండగా, బీఆర్ఎస్‌ ప్రభుత్వం కేవలం రూ. 40 లక్షలకే కట్టబెట్టింది. దీనివల్ల ఆ సంస్థకు రూ. 34.60 కోట్ల మేర అక్రమ లబ్ధి చేకూరినట్లు కాగ్ గుర్తించింది. కేబినెట్ సబ్ కమిటీ సదరు ప్రాజెక్టును కొంగర కలాన్ ఏరోస్పేస్ పార్కుకు తరలించాలని సూచించినప్పటికీ, పరిశ్రమల శాఖ ఆ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ మామిడిపల్లిలోనే రాయితీ ధరలకు భూమిని ఇచ్చేసింది.

రూ. 500 కోట్ల ఐఏఎల్ఏ నిధుల మళ్లింపు

పారిశ్రామిక ప్రాంతాల నిర్వహణ, స్థానిక సంస్థలకు చెల్లింపుల కోసం కేటాయించిన ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీస్ (IALA) నిధులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంది. సుమారు రూ. 500 కోట్లను దారి మళ్లించి ఇతర ప్రాజెక్టులకు ఖర్చు చేశారు.

1. ఫార్మా సిటీ భూసేకరణ కోసం రూ. 150 కోట్లు,

2. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ ఐటీ టవర్లు మరియు టీ-హబ్ (ఫేజ్-II) కోసం రూ. 100 కోట్లు.

3. వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రూ. 250 కోట్లు మళ్లించారు.

హడ్కో రుణాల దుర్వినియోగం

జహీరాబాద్ నిమ్జ్ (NIMZ) మరియు హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం హడ్కో (HUDCO) నుండి తీసుకున్న రూ. 725 కోట్ల రుణంలో.. రూ. 317.49 కోట్లను ఇతర అవసరాలకు వాడటం ద్వారా రుణ ఒప్పందాలను ప్రభుత్వం ఉల్లంఘించింది. ఇందులో రూ. 182 కోట్లు ఇతర ఇండస్ట్రియల్ పార్కులకు, రూ. 57 కోట్లు ఈ-సిటీ ప్రాజెక్టుకు, మిగిలిన నిధులను పాత అప్పులు తీర్చడానికి, ఆపరేషనల్ ఖర్చులకు వాడుకోవ‌డం గమనార్హం.

నిబంధనలకు విరుద్ధంగా భూ కేటాయింపులు

జహీరాబాద్ నిమ్జ్ లో వేమ్ టెక్నాలజీస్ సంస్థకు కేవలం 49 ఎకరాల అవసరం ఉండగా, ఏకంగా 511 ఎకరాలను కేటాయించి రూ. 106.91 కోట్ల మేర ప్రయోజనం కల్పించారు. ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పాలసీ గడువు ముగిసినా, 'ఎలక్ట్రానిక్స్ పాలసీ 2016' పేరుతో 165 ఎకరాలను తక్కువ ధరకే 39 యూనిట్లకు కేటాయించి రూ. 208 కోట్ల నష్టం చేకూర్చారు. 20 ఏళ్ల క్రితం నిబంధనల ప్రకారం వెనక్కి తీసుకోవాల్సిన 45 ఎకరాల భూమిని, జేసీకే ఇన్ఫ్రా సంస్థ నుంచి కేవలం రూ. 1.5 కోట్లు కట్టించుకుని తిరిగి అప్పగించి రూ. 53.4 కోట్ల లబ్ధి చేకూర్చారు. ఫార్మా సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు భూమి ఇవ్వడం కూడా ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుగార్చడమేనని కాగ్ తేల్చి చెప్పింది.

మొత్తం మీద బీఆర్‌ఎస్ పాలనలో టీఎస్‌ఐఐసీ స్వయంప్రతిపత్తిని కోల్పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టే వేదికగా మారిందని కాగ్ తన నివేదికలో నిగ్గుతేల్చింది.

Comments (0)