బీఆర్ఎస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం కరువు..? హరీశ్, కేటీఆర్ వైఖరిపై విమర్శలు
సొంత పార్టీ ఎమ్మెల్యేలకే మాట్లాడే అవకాశం ఇవ్వని నేతలు, బయట ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగా సాగిన చర్చలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత ప్రజాస్వామ్యంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా ఆ పార్టీ అగ్రనేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లు తమ సొంత పార్టీ ఎమ్మెల్యేల గొంతు నొక్కుతున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన ఇతర ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా, కేవలం ఈ ఇద్దరు నేతలే సమయాన్ని తమ అజెండాలను వెల్లడించాలనికి వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గణాంకాలు చెబుతున్న వాస్తవాలు
అధికార పార్టీ వెల్లడించిన వివరాల ప్రకారం, అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులకు కేటాయించిన మొత్తం 16 గంటల సమయంలో, సింహభాగం అంటే దాదాపు 6 గంటలు కేవలం హరీశ్‌రావు, కేటీఆరే మాట్లాడారు. ఇందులో హరీశ్‌రావు 4 గంటల 16 నిమిషాలు, కేటీఆర్ గంటా 44 నిమిషాల సమయాన్ని తీసుకున్నారు. అంటే పార్టీకి దక్కిన సమయంలో మూడో వంతు కంటే ఎక్కువ సమయం ఈ ఇద్దరే ఆక్రమించుకొని, మిగిలిన 30 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గొంతునొక్కుతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
సొంత పార్టీలోనే గొంతు నొక్కుతున్నారా?
బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా సభ్యులు మాట్లాడే వెసులుబాటు లేదని, అధిష్టానం కనుసన్నల్లోనే అంతా నడుస్తుందనే ఆరోపణలకు ఈ గణాంకాలే సాక్ష్యమని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ప్రతిపక్షం గొంతును ప్రభుత్వం నొక్కుతోందని విమర్శించే బీఆర్ఎస్ నేతలు, వాస్తవానికి బీఆర్ఎస్‌లోని ఇతర ఎమ్మెల్యేల గళాన్ని వినిపించకుండా అడ్డుకుంటున్నది కేసీఆర్, హరీష్‌రావులే అని తప్పుబడుతోంది. ప్రజా సమస్యలపై మాట్లాడాలనుకునే ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మైక్ అందకుండా ఈ ఇద్దరు నేతలే అవాస్తవాలను వల్లేవేయడానికి సభా సమయాన్ని వాడుకుంటున్నారని అధికార పార్టీ నేతలు తూర్పారబడుతున్నారు.
బాధ్యతారాహిత్యంపై విమర్శలు
అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరపడం కంటే, సభను తప్పుదోవ పట్టించేలా అవాస్తవాలు మాట్లాడటానికే హరీశ్, కేటీఆర్ ప్రాధాన్యతనిస్తున్నారని ప్రభుత్వ విప్‌లు ఆరోపిస్తున్నారు. దళితుడైన స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడటం, ప్రజలకు ఉపయోగపడే బిల్లుల చర్చలో క్రియాశీలకంగా వ్యవహరించకపోవడం వంటి చర్యలు ఆ పార్టీ దిగజారుతున్న తీరుకు అద్దం పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైకమాండ్ కల్చర్..?
అసెంబ్లీ గణాంకాల ప్రకారం 16 గంటల్లో 6 గంటలు కేవలం హరీశ్, కేటీఆర్‌లే మాట్లాడటం అనేది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదని, ఇది ఆ పార్టీలో కొనసాగుతున్న "హైకమాండ్ కల్చర్" కు కొనసాగింపు మాత్రమే అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే మాట్లాడే అవకాశం ఇవ్వని నేతలు, బయట ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని తప్పుబడుతున్నారు.