గులాబీ గూటిలో పేరు మార్పు లొల్లి: 'బీఆర్ఎస్' మళ్లీ 'టీఆర్ఎస్' అయ్యేనా?
కవిత ప్రకటన, ఇటు కేటీఆర్ సంకేతాల మధ్య కేసీఆర్ తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి 'గులాబీ' పేరు మార్పు అంశం హాట్ టాపిక్ గా మారింది. భారత్ రాష్ట్ర సమితిని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే దిశగా పార్టీ అధిష్టానం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, కవిత ప్రకటనలు ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
సెంటిమెంట్‌కు దూరమైన 'బీఆర్ఎస్'?
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి నాటుకుపోయిన 'టీఆర్ఎస్' పేరును జాతీయ రాజకీయాల ఆకాంక్షతో 'బీఆర్ఎస్'గా మార్చడం ఆ పార్టీకి రాజకీయంగా ప్రతికూలంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ పేరులో 'తెలంగాణ' అనే పదం లేకపోవడం వల్ల ప్రాంతీయ సెంటిమెంట్ దెబ్బతిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఒక కారణమని పార్టీ అంతర్గత చర్చల్లో వెల్లడైంది. తాజాగా మంచిర్యాల పర్యటనలో కేటీఆర్ మాట్లాడుతూ.. పేరు మార్పు వల్ల పార్టీ నష్టపోయిందని స్వయంగా అంగీకరించడం గమనార్హం.
కవిత ప్రకటనతో మొదలైన గుబులు
మరోవైపు, కవిత తన తదుపరి రాజకీయ ప్రయాణంలో భాగంగా 'టీఆర్ఎస్' పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంలో కలకలం రేపింది. అదే గనుక జరిగితే బీఆర్ఎస్‌కు రాజకీయంగా నష్టం కలుగుతుందని, ఈ విషయాన్ని పసిగట్టిన కేసీఆర్.. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలని యోచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత తన పార్టీ పేరులో తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించేలా టీఆర్ఎస్‌గా నామకరణం చేస్తే.. అది బీఆర్ఎస్‌ను దెబ్బతీస్తుదని, దీని వల్ల క్యాడర్ తీవ్ర ఆయోమయానికి గురవుతుందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ పేరునే మళ్ళీ పాత రూపంలోకి తీసుకురావాలనే ఆలోచన వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
పాత పేరు.. కొత్త ఉత్సాహం?
బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం ద్వారా తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని అధిష్టానం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు సైతం టీఆర్ఎస్ పేరు పట్ల మక్కువ చూపిస్తున్నారు. కేటీఆర్ తన చిట్‌చాట్‌లో "మళ్లీ పాత పార్టీ పేరు గురించి చర్చ జరుగుతోంది" అని చెప్పడం ద్వారా, పేరు మార్పుపై నిర్ణయం దాదాపు ఖరారైనట్లు సంకేతాలిచ్చారు. ఇది కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందా లేదా అనేది వేచి చూడాలి.
సవాళ్లు - రాజకీయ అనిశ్చితి
అయితే, పేరు మార్పు అనేది కేవలం సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు. ఎన్నికల సంఘం నిబంధనలు, జాతీయ రాజకీయాల్లో పార్టీ పాత్ర వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అటు కవిత ప్రకటన, ఇటు కేటీఆర్ సంకేతాల మధ్య కేసీఆర్ తుది నిర్ణయం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి 'తెలంగాణ' బ్రాండ్ మళ్లీ అవసరమని గులాబీ దళం బలంగా నమ్ముతోంది.