అంగన్‌వాడీ ఫోన్ల కొనుగోలు వివాదం: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు

The Deccan Desk·4d ago·1 min read·0
అంగన్‌వాడీ ఫోన్ల కొనుగోలు వివాదం: కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు

ఈ నోటీసు ద్వారా మంత్రి సీతక్క 48 గంటల గడువును విధించారు. వివాదాస్పద పోస్టులను తక్షణమే తొలగించి, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాష్ట్ర మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపారు. బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్క తరపు న్యాయవాది నాగులూరి కృష్ణ కుమార్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేసీఆర్‌కు ఈ నోటీసులు పంపించారు.

పూర్తి పారదర్శకంగా

ఈ నోటీసులో మంత్రి సీతక్క కీలక అంశాలను ప్ర‌స్తావించారు. అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే కాంట్రాక్ట్ కేటాయించారని ఆమె వివరించారు. ఈ కొనుగోలు ప్రక్రియతో తనకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆధారాలు లేకుండా ఆరోపణలు

ముఖ్యంగా, మొత్తం టెండర్ విలువే రూ. 44 కోట్లు ఉండగా, అందులో ఏకంగా రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం అత్యంత అసంబద్ధమని, కనీస ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని సీతక్క పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో జరుగుతున్న ఈ ప్రచారానికి ఆ పార్టీ అధినేతగా కేసీఆరే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు.

48 గంటల గడువు

ఈ నోటీసు ద్వారా మంత్రి సీతక్క 48 గంటల గడువును విధించారు. వివాదాస్పద పోస్టులను తక్షణమే తొలగించి, కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ పరిణామం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Comments (0)