ప్రజలే కేంద్రబిందువుగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’: 99 రోజుల దీక్షకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు
ఈ 99 రోజుల కార్యాచరణను ఒక సాధారణ కార్యక్రమంగా కాకుండా, ఒక పవిత్ర ‘దీక్ష’గా భావించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి కోరారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి గ్రామ సభలు అత్యంత ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని పంపారు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడు నెలలు పూర్తయిన సందర్భంగా, గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతూ, ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ తమ ప్రభుత్వం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆయన వివరించారు. తాము పాలకులం కాదని, ప్రజల ఆకాంక్షలే కేంద్రబిందువుగా పనిచేసే సేవకులమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అందించిన వరుస విజయాలు తమ బాధ్యతను మరింత పెంచాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
99 రోజుల ఒక ఉద్యమం
ప్రభుత్వ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, సామాన్యుడి జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నదే ఈ ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ ముఖ్య ఉద్దేశమని ముఖ్యమంత్రి వెల్లడించారు. మార్చి 6 నుంచి ప్రారంభమైన ఈ 99 రోజుల కార్యాచరణ ఒక ఉద్యమంలా సాగాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడం, పరిశుభ్రతను పాటించడం, ప్రతి నిర్ణయంలో పారదర్శకతను ప్రదర్శించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని అధికారులకు సూచించారు. ఊరువాడల సమస్యల పరిష్కారమే ఈ కార్యక్రమం పరమావధి అని ఆయన తన సందేశంలో ఉద్ఘాటించారు.
క్షేత్ర స్థాయిలో పక్కాగా సంక్షేమం
రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు సౌకర్యం, ₹500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి ప్రతిష్టాత్మక పథకాలు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును మార్చే దిశగా ప్రతి అడుగు ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఆదర్శంగా నివాలన్నదే నా కల
భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రస్తావిస్తూ, “తెలంగాణ రైజింగ్ - 2047” విజన్ ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలన్నది తన సంకల్పమని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రాన్ని CURE, PURE, RARE క్లస్టర్లుగా వర్గీకరించి.. సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకువస్తామని పేర్కొన్నారు. ఈ 99 రోజుల కార్యాచరణను ఒక సాధారణ కార్యక్రమంగా కాకుండా, ఒక పవిత్ర ‘దీక్ష’గా భావించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలన్న తన కలను సాకారం చేసేందుకు ప్రతి బిడ్డ నడుం బిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.