కేసీఆర్ వల్లే నా గుర్తింపు.. నియోజకవర్గాల విభజనపై పోరాటం: సీఎం రేవంత్ రెడ్డి

The Deccan Desk·30 Mar 2026·2 min read·0
కేసీఆర్ వల్లే నా గుర్తింపు.. నియోజకవర్గాల విభజనపై పోరాటం: సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని అందరూ అంటున్నా, ఆయనను గృహ నిర్బంధం చేశారేమోనన్న అనుమానం తనకు కలుగుతోందని సోమ‌వారం మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో జరిగిన పరిణామాల వల్లే తాను చేసిన మంచి పనులు ప్రజలకు స్పష్టంగా తెలిశాయని, రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం లోకానికి తెలిసిందనే ఉదాహరణను ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని అందరూ అంటున్నా, ఆయనను గృహ నిర్బంధం చేశారేమోనన్న అనుమానం తనకు కలుగుతోందని సోమ‌వారం మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దక్షిణ భారత్‌కు అన్యాయం జరగనివ్వం

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేస్తున్న వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇది కేవలం రాజకీయ పార్టీల సమస్య కాదని.. యావత్ దక్షిణ భారత ప్రజల సమస్య అని పేర్కొన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా కేంద్ర నిర్ణయాలు ఉండకూడదని, అవసరమైతే దీనిపై లక్ష్మణ్ రాజీనామా చేసి తన నిరసన తెలపాలని డిమాండ్ చేశారు. బ్రూటల్ మెజార్టీ కోసం చూస్తూ నియంతృత్వ ధోరణి ప్రదర్శించడం దేశానికి మంచిది కాదని హెచ్చరించారు.

సన్నబియ్యం పథకం - ఒక ఏడాది విజయప్రస్థానం

పేద ప్రజల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. గత 40 ఏళ్లుగా దొడ్డు బియ్యం ఇస్తుండటం వల్ల అవి రీసైక్లింగ్ మాఫియా చేతుల్లోకి వెళ్లేవని, ఇప్పుడు నేరుగా పేదలకు తినగలిగే నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం రైతులకు క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, దీనివల్ల 86 శాతం తెలంగాణ ప్రజలు లబ్ధి పొందుతున్నారని వివరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను పౌరసరఫరాల శాఖ సమర్థవంతంగా అడ్డుకుందని కొనియాడారు.

ఆహార కల్తీపై 'హైడ్రా' తరహా నిఘా వ్యవస్థ

ప్రభుత్వం తదుపరి లక్ష్యం విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందించడమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం వరి పండించడమే కాకుండా రైతులు వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలని, పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఆహార కల్తీని అరికట్టడానికి ఈగల్, హైడ్రా తరహాలోనే ఒక ప్రత్యేకమైన మరియు పకడ్బందీ వ్యవస్థను రాష్ట్రంలో తీసుకురానున్నట్లు ప్రకటించారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేయడం హత్యానేరం కంటే పెద్ద నేరమని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.

Comments (0)