కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం : విద్వేష ప్రసంగాలు చేస్తే ఇక కటకటాల్లోకే
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో తెలంగాణలో సామాజిక, మతపరమైన స్థిరత్వానికి వెన్నెముకగా నిలవనుంది.
తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం ప్రవేశపెట్టిన 'విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేష పూరిత నేరాల నిరోధక బిల్లు-2026' రాష్ట్ర సామాజిక భద్రతలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందని చెప్పవచ్చు. గంగా-జమునా తెహజీబ్‌కు నిలయమైన తెలంగాణలో, మత విద్వేషాల ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసే శక్తులకు ఈ బిల్లు ఒక హెచ్చరికలాంటిది. స్వేచ్ఛా ప్రసంగానికి, విద్వేషపూరిత ప్రసంగానికి మధ్య ఉన్న సన్నని గీతను శాసనబద్ధం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో తెలంగాణలో సామాజిక, మతపరమైన స్థిరత్వానికి వెన్నెముకగా నిలవనుంది.
నిరోధక చర్యల నుంచి కఠిన శిక్షల వరకు
ఈ బిల్లులోని అత్యంత కీలకమైన అంశం నేరాల తీవ్రతను బట్టి నిర్ధారించిన శిక్షాస్మృతి. సాధారణంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారు బెయిల్‌పై వెంటనే బయటకు వచ్చి మళ్లీ అవే తప్పులు చేసే అవకాశం ఉండేది. కానీ, తాజా బిల్లు దీనిని నాన్-బెయిలబుల్ (బెయిల్ రాని) నేరంగా మార్చడం ద్వారా చట్టం పట్ల భయాన్ని, బాధ్యతను పెంచుతోంది. మొదటిసారి తప్పు చేసిన వారికే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించడం, రెండోసారి పునరావృతమైతే పదేళ్ల వరకు పొడిగించడం అనేది మతపరమైన అంశాలతో రాజకీయం చేయాలనుకొనే కొన్ని సంఘ విద్రోహ శక్తులకు వణుకు పుట్టిస్తోంది. కేవలం జైలు శిక్షకే పరిమితం కాకుండా, బాధితులకు నష్టపరిహారం ఇప్పించే నిబంధన బాధితుల పట్ల ప్రభుత్వానికి ఉన్న సానుకూల దృక్పథాన్ని చాటుతోంది.
డిజిటల్ కట్టడి: సోషల్ మీడియాపై ఉక్కుపాదం
నేటి కాలంలో మతపరమైన ఉద్రిక్తతలు అత్యధికంగా సోషల్ మీడియా వేదికల్లో పురుడు పోసుకుంటున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి వేదికల్లో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ఉద్రిక్తతలు సృష్టించే ముఠాలకు ఈ బిల్లు కళ్లెం వేయనుంది. ప్రభుత్వం నియమించే డిజిగ్నేటెడ్ ఆఫీసర్‌ఖు కట్టబెట్టిన అధికారాలు అత్యంత ప్రభావవంతమైనవి. అభ్యంతరకర కంటెంట్‌ను గుర్తించిన వెంటనే సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసి, ఆ సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే వీలు కలుగుతుంది. ఇది అల్లర్లు చెలరేగక ముందే విద్వేషపూరిత అంశాలపై ఉక్కుపాదం మోపడం వంటి చర్య అని చెప్పవచ్చు.
ప్రజాహితమే పరమావధి: ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం
ఏదైనా ఒక కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు విమర్శలు రావడం సహజం, కానీ పాలకులకు 'ప్రజా క్షేమమే' ప్రథమ కర్తవ్యం కావాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విద్వేష నిరోధక బిల్లు-2026, కేవలం ఒక చట్టం మాత్రమే కాదు; ఇది రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభుత్వానికి ఉన్న దూరదృష్టికి (Vision) నిదర్శనం. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో సమాజంలో చిచ్చు పెట్టే హక్కు ఎవరికీ ఉండకూడదన్నది ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. భావప్రకటనా స్వేచ్ఛ అనేది బాధ్యతాయుతంగా ఉండాలే తప్ప, అది ఇతర వర్గాల మనోభావాలను గాయపరిచేలా లేదా శాంతికి విఘాతం కలిగించేలా ఉండకూడదు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత స్పష్టతతో, దృఢ సంకల్పంతో అడుగులు వేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ దృఢ వైఖరి
తెలంగాణ నేడు ప్రపంచపటంలో ఐటీ - పారిశ్రామిక దిగ్గజ సంస్థలకు ప్రధాన కేంద్రంగా ఉంది. వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా, రాష్ట్రం ఆర్థికంగా సుస్థిరంగా ఉండాలన్నా శాంతిభద్రతలే 'ఆయువుపట్టు'. అల్లర్లకు ఆస్కారం ఇచ్చే విద్వేష ప్రసంగాలనే 'వైరస్'ను ఆదిలోనే అంతం చేసేందుకు ఈ చట్టం ఒక శక్తివంతమైన అస్త్రంగా పనిచేస్తుంది. అరాచక శక్తులపై ప్రభుత్వం మోపిన ఈ 'ఉక్కుపాదం', సామాన్య ప్రజలకు - ఇన్వెస్టర్లకు ఒక కొండంత భరోసాను ఇస్తుంది. శాంతిని కాపాడటంలో రాజీ పడకూడదనే కాంగ్రెస్ ప్రభుత్వ దృఢ వైఖరి, తెలంగాణను దేశంలోనే అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది.