2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్‌టైల్ రాజధానిగా మారుస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

The Deccan Desk·14d ago·2 min read·0
2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియా టెక్స్‌టైల్ రాజధానిగా మారుస్తాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూమి, విద్యుత్, నీరు, రాయితీలతో పాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా వస్త్ర పరిశ్రమలోనూ ప్రపంచానికి దిక్సూచిగా మారబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన 13వ ఏషియన్ టెక్స్‌టైల్స్ కాన్ఫరెన్స్ 2026 (ATEXCON) ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. టెక్స్‌టైల్ రంగ ప్రముఖులనుద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో వారంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మన DNAలోనే టెక్స్‌టైల్ ఉంది

భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణకు వస్త్రాల తయారీలో ఘనమైన చరిత్ర ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. "టెక్స్‌టైల్ అనేది మాకు కేవలం పరిశ్రమ కాదు, అది మా జీవనాధారం మరియు మా DNAలోనే ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు. నిజాం కాలం నుండి హైదరాబాద్ ముత్యాలు, వస్త్రాలకు ప్రపంచ కేంద్రంగా ఉందని.. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ చీరలు, వరంగల్ దుర్రీస్, నారాయణపేట చేనేత వంటివి తెలంగాణ వారసత్వానికి ప్రతీకలని కొనియాడారు. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ఇక్కడి పత్తి నాణ్యతకు అంతర్జాతీయంగా మంచి పేరుందని పేర్కొన్నారు.

లక్ష్యం: 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

రాష్ట్ర భవిష్యత్తు కోసం "తెలంగాణ రైజింగ్ 2047" విజన్‌ను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో భాగంగా 2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాలోనే టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ద్వారా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

గ్లోబల్ ఫ్యాషన్ షోల నుండి హాలీవుడ్ వరకు..

తెలంగాణ పొలాల్లో పండే పత్తి.. లండన్, పారిస్, మిలాన్, టోక్యో వంటి అంతర్జాతీయ ఫ్యాషన్ షోల వరకు చేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. హైదరాబాద్ ఇప్పుడు సినిమా నిర్మాణానికి ప్రపంచ కేంద్రంగా మారుతోందని, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు ఇక్కడ స్టూడియోలు పెట్టడం దీనికి నిదర్శనమని అన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు ఇప్పుడు హాలీవుడ్ కూడా హైదరాబాద్ వైపు చూస్తోందని, సినిమా రంగం తమ ఫ్యాషన్ అవసరాల కోసం తెలంగాణపై ఆధారపడేలా ప్రోత్సహిస్తామని చెప్పారు.

పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భూమి, విద్యుత్, నీరు, రాయితీలతో పాటు వేగంగా అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. "మీకు విజన్ ఉంటే, మేము సరైన భాగస్వాములం" అని ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామని, మహిళలకు అధునాతన డిజైనింగ్, స్టిచ్చింగ్ అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించిన తెలంగాణ, ఇప్పుడు ప్రపంచం ధరించే దుస్తులను కూడా తయారు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments (0)