నాదర్‌గుల్ ‘నాటకం’: పొంగులేటిని టార్గెట్ చేయడం వెనుక బీఆర్ఎస్ వ్యూహం ఇదేనా?
నాదర్‌గుల్ భూముల వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పు వచ్చే వరకు, ఇవన్నీ కేవలం ‘రాజకీయ బురదజల్లుడు’ కార్యక్రమాలుగానే మిగిలిపోయేలా కనిపిస్తున్నాయి.
రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ‘నాదర్‌గుల్ భూముల’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. రంగారెడ్డి జిల్లాలోని సర్వే నంబర్ 613 చుట్టూ రేగిన ఈ వివాదం కేవలం భూమికి సంబంధించింది మాత్రమే కాదు, ఇది పక్కా రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, దానికి ప్రతిగా కంపెనీ ఇచ్చిన వివరణలు గమనిస్తే.. ఈ వ్యవహారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇరకాటంలో పెట్టే ప్రయత్నం జరుగుతోందనే? అనే అనుమానాలు బలపడుతున్నాయి. వట్టినాగుల పల్లి భూమలు వ్యవహారంలో కూడా బీఆర్ఎస్ ఇలాగే హడావుడి చేసిందని గుర్తు చేస్తున్నారు.
పాత వివాదం.. కొత్తగా తెరపైకి!
నిజానికి నాదర్‌గుల్ భూముల వివాదం నిన్న మొన్నటిది కాదు. 2005 నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈ కేసులో ఇప్పుడు అకస్మాత్తుగా వేడి పెరగడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఇది 'ఫూట్ ఖరాబ్' (వ్యవసాయానికి పనికిరాని) భూమి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కోర్టు విచారణలో ఉన్న అంశాన్ని మీడియా ట్రయల్‌గా మార్చడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే బీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
పొంగులేటిని టార్గెట్ చేయడం వెనుక అసలు కారణం?
బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా మంత్రి పొంగులేటిని, ఆయన కుమారుడు హర్షారెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. హర్షారెడ్డి 2021 నుంచి 2023 మార్చి వరకు మాత్రమే సదరు ల్యాండ్ డెవలెప్‌మెంట్ హక్కులు పొందిన కంపెనీల్లో అదనపు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన రాజీనామా చేసి దాదాపు ఏడాదిన్నర దాటిపోయింది. అయితే పొంగులేటి లాంటి బలమైన మంత్రిపై ఆరోపణలు చేస్తే, అది ప్రభుత్వం మొత్తానికి డ్యామేజ్ కలిగిస్తుందని ఓ అంచానాకు వచ్చిన బీఆర్ఎస్ ఈ రకంగా స్కాం ఆరోపణలు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.
తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న 600 మంది పేద రైతుల పేరును తెరపైకి తేవడం ద్వారా బీఆర్ఎస్ ఈ వివాదానికి ‘సెంటిమెంట్’ రంగు పులిమింది. పేద మహిళా రైతులకు డబ్బు ఆశ చూపడం, బౌన్సర్లతో దాడులు చేయించడం వంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తోంది. అయితే, కోహినూర్ గ్రూప్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ భూమి ప్రైవేట్ ఆస్తి అని, 2021లోనే ప్రహరీ నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. అంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రహారీ నిర్మాణం జరిగినా అప్పడు స్పందించని విపక్ష నేతలు ఇప్పుడు ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని చర్చ జరుగుతోంది.
రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలా?
మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే, నాదర్‌గుల్ భూముల విషయంలో చట్టపరమైన అంశాల కంటే రాజకీయ అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రి కుటుంబానికి సంబంధం లేదని రికార్డులు చెబుతున్నా, పాత సంబంధాలను వెలికితీసి ప్రస్తుత కుంభకోణంగా చిత్రీకరించడం వెనుక బీఆర్ఎస్ వ్యూహం స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతున్న తరుణంలో, ఏదో ఒక స్కామ్‌ను బయటపెట్టినట్లుగా చూపించి ప్రత్యర్థి పార్టీ ఆత్మరక్షణలో పడేలా చేయడమే ఈ వ్యూహంలోని ప్రధాన భాగమని రాజకీయ విషకులు అభిప్రాయపడుతున్నారు. నాదర్‌గుల్ భూముల వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పు వచ్చే వరకు, ఇవన్నీ కేవలం ‘రాజకీయ బురదజల్లుడు’ కార్యక్రమాలుగానే మిగిలిపోయేలా కనిపిస్తున్నాయి.