వట్టినాగులపల్లి భూ వివాదం: మంత్రి పొంగులేటిపై రాజకీయ దాడి? వాస్తవాలు ఏంటి?

The Deccan Desk·17d ago·2 min read·0
వట్టినాగులపల్లి భూ వివాదం: మంత్రి పొంగులేటిపై రాజకీయ దాడి? వాస్తవాలు ఏంటి?

భూ బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం కంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

హైదరాబాద్: వట్టినాగులపల్లిలోని సర్వే నంబర్లు 245, 259, 262లకు సంబంధించిన భూ వివాదం ప్రస్తుతం రాజకీయ రంగు పులుముకుంది. అయితే, ఈ వివాదంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు ఈ అంశాన్ని అందిపుచ్చుకుని మంత్రిపై విమర్శలు గుప్పించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూ యజమానులు స్వయంగా రంగంలోకి దిగి, ఇది కేవలం తమ కుటుంబ అంతర్గత వ్యవహారమని, ఇందులో మంత్రికి గానీ, ఆయన కుటుంబానికి గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడంతో బీఆర్ఎస్ వాదనల్లో పస లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కుటుంబ వివాదానికి రాజకీయ రంగు..

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో భూ యజమానులు ఆవినవ్ షా, సుధీర్ కుమార్ షా, అక్షయ్ షా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వివాదం 1969 నుండి వారి కుటుంబానికి సంబంధించింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని వారు బహిరంగంగానే తప్పుబట్టారు. సాధారణంగా ప్రాజెక్టు డెవ‌లెప్‌మెంట్‌లో డెవలపర్లుగా ఎవరైనా ఉండవచ్చు, కానీ ఇక్కడ న్యూజెన్ డెవలపర్స్ సంస్థలో పొంగులేటి హర్ష ఒక భాగస్వామి మాత్రమేనని, ఆ కారణంతోనే మంత్రిని ఈ వివాదంలోకి లాగడం వెనుక విపక్షాల వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందనే చ‌ర్చ న‌డుస్తోంది.

బీఆర్ఎస్ నేతల పొలిటిక‌ల్ వెండెట్ట‌?

తెలంగాణ భవన్‌కు వస్తే న్యాయం చేస్తామని ప్రకటిస్తున్న కేటీఆర్, హరీశ్ రావు కేవలం ఒక వర్గం మాటలే విని నిర్ణయానికి రావడంపై భూ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ వాదనను కూడా వినాలని, ఇరుపక్షాల వాస్తవాలను తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని వారు సూచించడం గమనార్హం. రాఘవ కన్స్ట్రక్షన్స్‌తో తమకు ఎలాంటి ఒప్పందం లేకపోయినా, కావాలనే ఆ సంస్థ పేరును, మంత్రి పొంగులేటి పేరును వివాదంలోకి చేర్చడం ద్వారా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది.

కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌డ‌మే ల‌క్ష్యం?

బీఆర్‌ఎస్ నేతలు మంత్రి పొంగులేటిని లక్ష్యంగా చేసుకుని గట్టి వ్యూహంతోనే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ధరణిలో లోపాలు ఉన్నాయంటూ, రెవెన్యూ అధికారుల తీరును ఎండగడుతూ, నేరుగా మంత్రి కుమారుడిని వివాదంలోకి లాగడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచాలన్నది బీఆర్ఎస్‌ ఉద్దేశంగా కనిపిస్తోంది. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ నేత‌లు గవర్నర్‌ను కలవ‌డం చూస్తుంటే, ఈ భూ వివాదం కేవలం స్థానిక సమస్యగా కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ చేస్తున్న రాజ‌కీయం అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

టార్గెట్ పొంగులేటి..!

కోర్టు పరిధిలో ఉన్న భూ వివాదానికి రాజకీయ రంగు అద్దడం ద్వారా అసలు బాధితులు ఎవరు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అటు ప్రతిపక్షం 'కబ్జా' అంటుంటే, ఇటు యజమానులు 'కుటుంబ వివాదం' అంటున్నారు. మొత్తానికి, వట్టినాగులపల్లి భూ వ్యవహారం చుట్టూ జరుగుతున్న ప్రచారం చూస్తుంటే, ఇది భూ బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం కంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

Comments (0)